బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత ।
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥
నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా |
భృగ్వాది మునయః శిష్యా తస్మై శ్రీ విఖనసే నమః ||
శ్రీమహావిష్ణువుని ప్రప్రథమంగా అర్చన చేసిన మహర్షి శ్రీ మత్ విఖనస మహర్షి. ఆ మహర్షికి శిష్యులుగా భృగు, మరీచి, అత్రి, కశ్యపులు వైఖానస ఆగమమును రచయించి వైఖానస ఆగమ రచయితలుగా ఖ్యాతి పొందారు. ఆ మహర్షులలో ఒకరైన అత్రి మహర్షి త్రేతాయుగ కాలమున అత్యంత సౌభాగ్య సంపన్న పూరితమైన దండకారణ్య ప్రాంతమున చాలా కాలము ఆశ్రమము నిర్మించుకొని శిష్య బృందం సమేతంగా నివసించుచూ తపమాచరించెను. ఆ తపముచే సంతసించిన శ్రీ హరి నృసింహ రుపమున సాక్షాత్కరించెను. అత్రి మహర్షి కోరిక చేత స్వామి మహాలక్ష్మితోకూడి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిగా వెలసెను. ఆ మూర్తిని అత్రి మహర్షి వైఖానస ఆగమాన్ని అనుసరించి అర్చనాది కైంకర్యములు నిర్వహించెను. అత్రి మహర్షి సప్తర్షి మండలంలో నక్షత్ర రూపము దాల్చిన తర్వాత ఆయన శిష్య పరంపర స్వామిని వైఖానస ఆగమం ప్రకారము సేవించిరి. కాల చక్రం గడిచి యుగాలు గడిచినవి.
అది కలియుగం, శాలివాహన శకం, ౧౦౩౯(1039) సంవత్సరం కుళోత్తుంగ చోళుని పరిపాలనలో ఆ ప్రాంతం అత్రిపురంగా పరిపాలించ బడుచున్నది. అన్ని సదుపాయాలతో ఆ ప్రాంతం గొల్లలకు ఆవాసంగా మారింది.
వెంకన్న అను పేరు గల గొల్ల యువకుని గోవుల మందలో బాగా పాలిచ్చే ఆవు ఒకటి కలదు. ఒక సారి ఆ గోవు మూడు రోజులుగా పాలు ఇవ్వడంలేదు. అది గమనించిన వెంకన్న నాల్గవ రోజు ఆవులను మేతకు వదిలి ఆ గోవును జాగ్రత్తగా గమనించెను. ఆ గోవు మంద నుండి తప్పుకొని గుబురుగా పెరిగిన పొదల మధ్యలో ఉన్న ఒక పాల చెట్టు కింద నిలిచెను. ఆ పుట్టలోనుంచి సింహం వాలే వక్త్రం కలిగిన ఐదేళ్ల బాలుడు బయటకి వచ్చెను. ఆవు అమితానందంతో ఆ బాలునకు పాలు ఇచ్చుచుండగా ఆ బాలుడు పాలును త్రాగుచుండును. ఇది అంతా ఒక చెట్టు వెనుక ఉంది గమనిస్తున్న వెంకన్న క్రోధంతో చేతిలోని కర్రను ఆవు పై విసిరెను. ఆవు తత్తరపడి బాలుని వక్షస్థలంపై కాలు వేసి ఎగిరి దూకెను. క్షణకాలంలోనే ఆ బాలుడు మాయమైపోయెను. వెంకన్న ఆ ప్రాంతంలో బాలుడిని వెతికి దొరకక ఆల మందలతో ఇంటికి చేరెను.
ఉదయం కోడి కూతతో నిద్ర లేచిన వెంకన్న కనులు తెరిచి చూడగా అంతా చీకటి. మరల కనులు నులుముకొని చూచినా అంతా అంధకారమే. వెంకన్నకు భయంవేసి కేకలు పెట్టగా ఇంటిలోవారు చుట్టుప్రక్కలవారు అక్కడకు చేరిరి. ఏమిటి వెంకన్న ఏం జరిగింది అని అడగగా వెంకన్న కనులు కనపడట్లేదు అంటూ ఏడవసాగెను. అప్పుడు వారు నీళ్లు తెచ్చి కళ్ళు కడిగారు, ఇంకా వాళ్లకు తెలిసిన వైద్యాలు ఏవో చేసారు కానీ ఫలితం లేదు. వారిలో నరహరి అనే కులపెద్దకు ఒడలు పులకరించి పూనకం వచ్చింది. నేను నరసింహ స్వామిని ! పాల చెట్టు క్రింద పుట్టలో ఉన్నాను. ఆవును కొట్టి అపచారం చేసావు, నన్ను సేవించు నీకు చూపు తిరిగివస్తుంది అని హుంకరించెను. వెంకన్న తన తప్పు క్షమించమని స్వామిని వేడుకొని పొంగలి చేసి పూజిస్తానని మొక్కుకున్నాడు. వెంకన్నకు చూపు తిరిగి వచ్చింది. అప్పుడు వారు పాలచెట్టు వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పొదలు నరికి నేలను చదును చేసి ఆ ప్రదేశాన్ని అలంకరించి అక్కడే ఉన్న పుట్టలోనుంచి స్వామి విగ్రహాన్ని బయటకు తీసి పాల చెట్టు మొదట్లో పెట్టి పూజించారు. అప్పుడు వారు స్వామి వారి విగ్రహ వక్షస్థలం పై ఆవు పాద ముద్ర అలాగే పెదవుల చివరినుండి కారిన పాల చుక్కల గుర్తులు కనిపించాయి. స్వామి ఎదురుగా ఒక గుండం తీసి అందులో పొంగళ్ళు వండారు. అలాగే గుండంలో నిప్పులమీద నడిచి స్వామి పై తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు. ఈ సేవ బారుగుండాల సేవగా ప్రసిద్ధికెక్కింది. అలా కొంత కాలం గడిచింది.
ఈ కథకు గుర్తుగా నేటికీ స్వామి వారి విగ్రహ వక్షస్థలం పై ఆవు పాద ముద్ర అలాగే పెదవుల చివరినుండి కారిన పాల చుక్కల గుర్తులు కనిపిస్తాయి.
అది ౧౧౯౯(1199) సం||, ఆ ప్రదేశంలో ఎఱ్ఱ కలువలు ఎక్కువ పూయడంతో అత్రిపురం హల్లకపురంగా ప్రసిద్ధి చెందింది. కాకతీయ కుమార రుద్ర గణపతి పాలనలో అప్పటి ధనధవోలుగా పిలువబడిన ఇప్పటి చందోలు సామంత పాలకుడైన కృత్తి వేంకటాద్రి గారు స్వామి వారి మహిమ తెలిసి స్వామికి ఆలయం కట్టిస్తానని మాట ఇచ్చి ఆ రాత్రికి అక్కడే బస ఏర్పాటు చేసుకున్నారు. నిద్రిస్తున్న వెంకటాద్రికి ఒక దేవత కలలో కనపడి తన పేరు అల్లూరమ్మ అని వేంకటాద్రి గారి గుడారానికి దగ్గరలో ఉన్న ఒక పొదలో తాను ఉన్నానని తనను వెలికితీసి తన పేరుతో ఒక ఊరు నిర్మించమని కోరింది. వేంకటాద్రి గారు అలాగే పొద నరికించి అల్లూరమ్మ విగ్రహాన్ని వెలికి తీయించి ఆ ప్రాంతం అంతా ఆమె పేరుమీదుగా అల్లూరు అని పిలవబడుతుంది శాసించారు. అలాగే అల్లూరులో శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారికి ఆలయం నిర్మించి అల్లూరమ్మకు మిద్దె కట్టించారు.
౧౨౪౧(1241) సంవత్సరంలో ప్రముఖ వర్తకుడు అవచి తిప్పయ్య శ్రేష్టి నరసింహ స్వామికి ఒక గంట సమర్పించారు. ఆ గంటను నేటికీ మనం స్వామివారి దేవాలయంలో చూడగలం. ౧౧౯౭(1197) సం|| లో ఉల్లిపాలెం రాజా వెంకట రామప్పరావు బహద్దూరు వారు స్వామివారి దేవాలయ నిర్వహణకు మరియు ఇతర సేవలకు భూమిని సమర్పించారు. ౧౭౬౯(1769) సం|| లో నిజాంపట్నం వాస్తవ్యులైన నాళం గురివిశెట్టి, నాళం శేషాచలం అనే ఓడ వ్యాపారులు పురాతన దేవాలయం శిధిలం అయిపోగా దేవాలయాన్ని పునర్నిర్మించారు.
అదే సంవత్సరంలో గోదావరి తీర వాస్తవ్యులైన కందాళం రామప్పయాళ్వారు అనే మధ్య వైష్ణవ గురువు పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ అల్లూరు శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దర్శనానికి విచ్చేసారు. ఆ సమయంలో ఐదు తలల సర్పం ఒకటి స్వామి వారికి ఛత్ర సేవను అందిస్తున్నది. అర్చకులు సైతం స్వామివారి వద్దకు వెళ్ళటానికి భయపడ్డారు. ఊరి పెద్దలందరూ సమావేశమై రామప్పయాళ్వారును సర్ప ఉపద్రవం నుంచి కాపాడమని కోరారు. అప్పుడు వారు వీరశైవ మతస్థులను ఉద్దేశించి "మీరందరూ వైష్ణవ మతాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటే నేను సర్ప ఉపద్రవాన్ని పొగడతాను" అన్నారు, అందుకు వారందరు సమ్మతించారు. అప్పుడు రామప్పయాళ్వారు వారు ఆ నాగ దేవతను ప్రసన్నం చేసుకుని శిలా ప్రతిమగా మార్చి దేవాలయ ప్రెవేశ ద్వారం వద్ద ప్రతిష్టించారు. అలాగే ఆ నాగ దేవతకు ౧౦౮(108) ప్రదక్షిణలు చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందని, భక్తుల కోరికలు తీర్చడం చేత కామేశ్వరి దేవిగా పిలవబడుతుందని రామప్పయాళ్వారు చెప్పారు.
ఆ తర్వాత ౧౮౭౮(1878) సం|| లో ఉత్పల లక్ష్మీనరసింహాచార్యులు అను అగ్రహారీకులు లక్ష్మీ నరసింహ స్వామికి మహస్థల నిర్వహణకు ౫౨(52) ఎకరముల భూమిని సమర్పించారు. ఇటీవల కోతుల రామదాసు అనే కోతలుంఆడించుకొను భక్తుడు స్వామివారి పంచాంగ శ్రవణమునకై భూమిని సమర్పించి ఉన్నారు. ౧౯(19) శతాబ్దపు మొదటి దశకంలో ఒక వృక్షము ఎటి ద్వారా కొట్టుకొని వచ్చి అల్లూరు పరిసరాలలో ఒడ్డుపట్టి నిలిచిపోగా ఒక భక్తునికి స్వామి కలలో కనిపించి తన ఆలయమునకు ఆ వృక్షాన్ని ధ్వజముగా నిలుపమని చెప్పగా ఆ వృక్షాన్ని ధ్వజస్థంభంగా నిలిపారు. అదే విధంగా ౨౦౦౭(2007) సం||లో క్రొత్తగా నిర్మించిన రథమునకు కావలసిన తాడు సముద్రంలో కొట్టుకొని వచ్చింది. దానిని భక్తులు స్వామికి సమర్పించారు. ఇటీవలి కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ(Endowments Department) వారిచే నిర్మిచబడిన ముఖ మండపం ఆలయ శోభను మరింత పెంచింది.